اقلیتی طلبہ کے لیے تعلیمی امدادی پروگرام میں توسیع
నెల్లూరు, జూన్ 21: బారా షహీద్ దర్గా విశిష్టత
నెల్లూరు నగరం లో రొట్టెల పండుగ సందడి మొదలైంది.విదేశాల నుండి వేరువేరు రాష్ట్రాలు, జిల్లాల నుండి భక్తులు నెల్లూరులోని బారాషహీద్ దర్గాకు తరలి వస్తున్నారు.ఇక్కడి స్వర్ణాల చెరువులో, బారాషహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెలు తీసుకుంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం. సాధారణంగా సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెల గురించి మనందరికీ తెలుసు.అయితే బారాషహీద్ దర్గా లోని 12 మంది యుద్ధ వీరుల దర్గా వద్ద మాత్రం ఆరోగ్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, పెళ్లి, సంతానం, విదేశీ రొట్టెలు పంచుకొంటూ ఉంటారు.
Awaztv.in
మనకు కావలసిన కోర్కె కు సంబంధించిన రొట్టెను మొదటగా తీసుకోనీ కోర్కెలు తీరిన అనంతరం మరుసటి సంవత్సరం కోరిన కోరికలు తీరడం వలన తిరిగి మనం రొట్టెలు వదలడం ఆనవాయితీ. తప్పకుండా ఇక్కడ మన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. ఉదాహరణకు మీకు పెళ్లి కావాలనుకుంటే ఇక్కడ పెళ్లి రొట్టెను పంచే వారి వద్దకు వెళ్లి మీరు పెళ్లి రొట్టెను తీసుకోవలసి ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆచారం 267 ఏళ్ల నాటి నుంచి కులమతాలకు అతీతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈనెల అనగా జూన్ 26 నుండి 30వ తేదీ వరకు నా రొట్టెల పండుగను ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, నెల్లూరులో జరుగుతుంది. ఈ పండుగను ముస్లింలు హిందూ సోదరులు అన్ని మతాల వాళ్ళు కుల మతాలకు ఆతీతంగా కలసి మెలసి చేసుకుంటారు. రొట్టెల పండుగకు సంబంధించిన చారిత్రక కథ ఒకటి ప్రచారంలో ఉంది. క్రీస్తుశకం 1751 లో సౌదీ అరేబియా దేశంలోని మక్కా నుండి 12 మంది వీరులు భారత్ కు వచ్చారు. అప్పుడు కర్ణాటక లో హైదర్ ఆలీ అనే రాజు పాలన ఉండేది. ఈ 12 మంది వీరులు హైదర్ తో కలిసి వివిధ ప్రాంతాలలో ప్రవక్త సందేశాలను వివరిస్తూ ఉండేవారు.
అదే కాలంలో తమిళనాడు వాలాజ రాజులకు, బీజాపూర్ సుల్తానులకు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, గండవరంలో భీకర యుద్ధం జరిగింది.
గండవరంలోని సాతో షహీద్ దర్గా అనే ప్రాంతం పవిత్ర యుద్ధం జరిగిన భూమిగా చరిత్ర చెబుతోంది. మొహరం నెల 13వ రోజున రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ యుద్ధంలో టర్కీ కమాండర్ జుల్ఫీ కార్ అలీ బేగ్ తో పాటు 11 మంది యుద్ధ వీరుల తలలు నరికి వేశారు.
ఈ యుద్ధ వీరుల తలలు గండవరంలో పడిపోగా, వీరీ మొండాలు మాత్రం గుర్రాల సాయంతో నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరాయి. అప్పుడు నెల్లూరు ఖాజీ కి 12 మంది షహీదులు కలలో కనిపించి మాకు నెల్లూరు స్వర్ణాల చెరువులో సమాధులు కట్టించమని చెప్పారు. వారి సూచనలను అనుసరించి వారికి వేరువేరుగా 12 సమాధులను నిర్మించారు . అప్పటి నుంచి ఆ సమాధులను బారా షాహిద్ దర్గాగానూ ఆ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని దర్గామిట్టగా పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతూ ఉండేవి. ఇది ఇలా ఉండగా అక్కడ నవాబు ల కాలంలో స్వర్ణాల చెరువులో రజకులు బట్టలు ఉతికేవారు. ఒకరోజు భార్యాభర్తలైన రజకులు చెరువులో బట్టలు ఉతుకుతూ ఉండగా బాగా పొద్దు పోవడంతో వారు అక్కడే నిద్రపోయారు.
రజకుని భార్యకు అక్కడ బారాషహీద్లు కలలో కనిపించి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకొని పోయి ఆమె నుదుటిపై రాస్తే ఆమె కోలుకుంటారు అని చెప్పారు. ఉదయాన్నే ఆ భార్యాభర్తలు గ్రామంలో వెళుతుండగా అక్కడ ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో ఉందని సరైన వైద్యం చేసే వారికి విలువైన బహుమతి అందజేస్తాం అని దండోరా వేస్తూ ఉంటారు. దీంతో రజకులు తమకు కలలో వచ్చిన దానినీ నవాబు రాజుకు వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద ఉన్న బారాషహీద్ సమాధుల ప్రక్కన ఉన్న మట్టిని తెప్పించి రాస్తారు. ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది దీంతో ఆ రాజు భార్యతో కలిసి నెల్లూరు స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి బారాషహీద్ల దర్గా వద్ద ప్రార్థనలు చేస్తారు. అటుపై వారు తెచ్చుకున్న రొట్టెలను అక్కడ ఉన్నవారికి పంచుతారు. అప్పటినుండి రొట్టెల పండుగ మొదలైంది అని చెబుతున్నారు. దాదాపు ప్రతి ఏడాది సుమారు 10 లక్షలకు పైగా భక్తులు ఈ రొట్టెల పండగ కు హాజరు అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం సుమారు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు దర్గాను సందర్శించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా. ఈ దర్గా విశిష్టత, ప్రాధాన్యత దృష్ట్యా గత పది సంవత్సరముల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది.
మా లక్ష్యం
ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించిన నిజమైన వార్తలు, ఉపయోగకరమైన సమాచారం, సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు మరియు సామాజిక అవగాహనను ప్రజలకు చేరవేయడం.
మా విజన్
విద్యావంతమైన, అవగాహన కలిగిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే ముస్లిం మైనారిటీ సమాజ నిర్మాణానికి మీడియా ద్వారా తోడ్పడడం.
మా నినాదం
“ఆవాజ్ టీవీ – మైనారిటీ సమాజం యొక్క నిజమైన స్వరం”
లేదా
“ఆవాజ్ టీవీ – మన హక్కులు, మన అభివృద్ధి, మన స్వరం”




